రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం.. దోస్తును కాపాడేందుకు ‘చీకటి’ రాజకీయం.. వారెవా తోడు దొంగల నాటకం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసారు.కిషన్ రెడ్డి గారూ..ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?.. లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?..అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది మేము అని తెలిపారు. రేవంత్ ను మొదట అభినందించింది మీరైతే.. మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము..అని గుర్తు చేసారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి?.. ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసం?.. అంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు అని ఆరోపించారు. మీ పాలి’ట్రిక్స్’ ను గమనిస్తోంది తెలంగాణ..ఆట కట్టిస్తుంది సరైన వేళ..అని కేటీఆర్ తెలిపారు.