– మహిళ మృతి.. బెంగళూర్‌లో ఘటన
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఓవర్ స్పీడ్‌తో కారు నడిపిన కన్నడ నటుడు నాగభూషణ.. ఓ జంటను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో నటుడు నాగభూషణ బెంగళూరులోని వసంతపుర మెయిన్‌రోడ్ ఫుట్ పాత్‌పై నడుస్తున్న దంపతులను కారుతో ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో నాగభూషణ ఉత్తరహళ్లి నుంచి కొననకుంటె వైపు వెళుతున్నారు. ఈ ఘటనలో ప్రేమ (48) అనే మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆదివారం ఉదయం మృతి చెందింది. ఆమె భర్త కృష్ణ (58)కు కాళ్లు, తల, పొట్టపై బలమైన గాయాలయ్యాయి. కారు ఢీకొనడంతో గాయపడిన జంటను నాగభూషణ స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లాడని పోలీసులు తెలిపారు. బెంగళూర్‌లోని కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.