Karnataka:కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ర్ట 24వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య శనివారం (మే 20వ తేదీ) ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్య చేత ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ , సీపీఐ నేత డీ. రాజా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సినీ నటులు, మక్కల్ నీది మయం అధ్యక్షులు కమల్ హాసన్ హాజరయ్యారు.