– 87 స్థానాల్లో పోటీ చేస్తం
– అభ్యర్థుల లిస్ట్ రెడీ చేశాం
– తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బరిలో ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. 87 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసినట్లు కాసాని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాజమండ్రి జైలులో పార్టీ అధినేత చంద్రబాబును ములాఖత్‌లో కలిసి మాట్లాడా. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించాను. తెలంగాణలో టీడీపీ బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం.
జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం. 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు ఆమోదించాక పేర్లు ప్రకటన ఉంటుంది. టీడీపీ తరఫున రాష్ట్రంలో ఏపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ప్రచారం చేస్తారు’అని కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు జ్ఞానేశ్వర్ చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ధోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు