Homeఅంతర్జాతీయంకశ్మీర్​ను గాజాతో పొల్చకూడదు

కశ్మీర్​ను గాజాతో పొల్చకూడదు

– జేఎన్​యూ మాజీ స్టూడెంట్ లీడర్ షెహ్లా రషీద్

ఇదే నిజం, ఢిల్లీ: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్​యూ) మాజీ స్టూడెంట్‌ లీడర్‌ షెహ్లా రషీద్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని పరిస్థితులను గాజాతో పోల్చకూడదని అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. కశ్మీర్‌లోని సమస్యను రక్తపాతం లేకుండా ప్రధాని పరిష్కరించారని కొనియాడారు.‘కశ్మీర్‌లో రాళ్లు రువ్వే ఆందోళనకారుల విషయంలో గతంలో నేను సానుభూతి చూపించిన మాట వాస్తవమే. కానీ, ఈ రోజు అక్కడి పరిస్థితులను చూసిన తర్వాత నేను ప్రభుత్వానికి రుణపడి ఉన్నాను. కశ్మీర్‌లోని పరిస్థితులను మనం గాజాతో పోల్చలేం. కశ్మీర్‌.. మరో గాజా కాదని ఇప్పటికే స్పష్టమైంది. ఎందుకంటే కశ్మీర్‌లో అక్రమ చొరబాట్లు, తిరుగుబాటు, ఆందోళనల వంటి ఘటనలు జరిగాయి. ఈ ఉద్రిక్తతలకు ఎవరో ఒకరు పరిష్కారం చూపించాలి. అది మన ప్రభుత్వం చేయగలిగింది. ముఖ్యంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకే ఈ క్రెడిట్‌ దక్కుతుంది. వారు దీనికి రాజకీయంగా పరిష్కారం చూపారు.

అది కూడా ఎలాంటి రక్తపాతం లేకుండా’అని షెహ్లా రషీద్ తెలిపారు. కాగా.. జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులను ఉద్దేశిస్తూ షెహ్లా రషీద్‌ భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో దీనిపై ఆమె మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు తగ్గాయని, పాలన మెరుగుపడిందని, కేంద్ర ప్రభుత్వ చర్యలతో ప్రజలు ప్రాణాలకు భద్రత ఏర్పడిందన్నారు. గత నెల గాజాలో ఇజ్రాయెల్‌ భీకర దాడులను ప్రారంభించిన సమయంలోనూ షెహ్లా స్పందిస్తూ.. భారతీయులుగా మనం ఎంతో అదృష్టవంతులమని అన్నారు. కశ్మీర్‌లో శాంతి, రక్షణ కోసం భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. 2016లో జేఎన్‌యూలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థి నాయకులు వ్యాఖ్యలు చేశారు. వారిలో షెహ్లా రషీద్‌ కూడా ఒకరు. ఆ తర్వాత కూడా ఆమె భారత్‌ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. 2019లో సాయుధ బలగాలు కశ్మీర్‌లో ఇళ్లను ధ్వంసం చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అదే ఏడాది జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే, ఈ ఏడాది ఆగస్టులో అనూహ్యంగా ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. ఆ తర్వాతి నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఆమె ప్రశంసలు కురిపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img