ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కవిత పోటీ చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. ఆమె నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవడమే మేలని కవిత భావిస్తున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పెద్దగా బలంగా లేదు. దీనికితోడు బీఆర్ఎస్ పార్టీ మీద కుటుంబపార్టీ అన్న ముద్ర బలంగా ఉంది. ఇక ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒకవేల ఎంపీగా గెలిస్తే మళ్లీ ఎమ్మెల్సీ సీటు ఖాళీ అవుతుంది. ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. పైగా గత ఎన్నికల్లో పసుపురైతులు కవితకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము పసుపుబోర్డు తీసుకొస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దీంతో పసుపు రైతులు బీజేపీ పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్తో ఉండొచ్చు. మరోవైపు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కోరుట్ల, జగిత్యాల మినహా ఎక్కడా బీఆర్ఎస్ గెలవలేదు. మిగిలిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ గెలుపొందాయి. ఇటువంటి పరస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని ఆమె భావిస్తున్నారట. అయితే కవితకు అధిష్ఠానం నిజామాబాద్ టికెట్ ఇవ్వడం లేదని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. కానీ అసలు పోటీ చేయడమే కవితకు ఇష్టం లేదని తెలుస్తోంది.
గత ఎంపీ ఎన్నికల్లో కవిత అనూహ్య ఓటమి
గత పార్లమెంటు ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయారు. కేసీఆర్, ఆయన కుటుంబం ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే మరి ఈ సారి జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కవిత నిజామాబాద్ బరిలో దిగబోతున్నారా? లేదా? అన్న చర్చ మొదలైంది. కవిత ఆ సారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఊపు మీద ఉన్నది. ఇక బీజేపీ మోడీ వేవ్ ను నమ్ముకున్నది. బీఆర్ఎస్ మాత్రమే కాస్త వెనకబడి ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది? అంటే ఇదమిత్థంగా ఇన్ని అని చెప్పలేని పరిస్థితి. ఒకవేళ గులాబీ బాస్ కేసీఆర్, కేటీఆర్ పోటీచేస్తే పరిస్థితి కొంత మారొచ్చు కానీ.. ఆ పార్టీ భారీ సంఖ్యలో సీట్లు గెలిచే పరిస్థితి లేదు. అందుకు ఇటువంటి పరిస్థితుల్లో కవిత తాను పోటీ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారట.
నిస్తేజంలో బీఆర్ఎస్ కేడర్
ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ కేడర్ కాస్త నిస్తేజంలో ఉంది. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజలను ఇంకా ఆశల పల్లకిలోనే ఉంచుతోంది. ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తోంది. దీంతో కాంగ్రెస్ హామీలను నెరవేరుస్తుందనే నమ్మకంతోనే జనం ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల దాకా ఇదే పరిస్థితి కొనసాగే చాన్స్ ఉంది. ఈ అంశం బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్ మీదున్న సింపతీని మాత్రమే నమ్ముకొని ఉంది. కేవలం సింపతీ వర్కవుట్ అయితే మాత్రమే ఆ పార్టీకి అన్నో ఇన్నో ఓట్లు రాలుతాయి. కేసీఆర్ ఆరోగ్యం కుదటపడ్డాక.. విస్తృతంగా జనంలో నియోజకవర్గాల్లో పర్యటిస్తే పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందేమో. కానీ ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పవర్ ఉంది. బీజేపీ మోడీని నమ్ముకున్నది. కానీ బీఆర్ఎస్ చేతిలో బలమైన ఆయుధం లేదు.
కుటంబపార్టీ ముద్ర
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మీద కుటుంబపార్టీ అన్న ముద్ర ఉంది. కవిత, కేటీఆర్, హరీశ్, సంతోష్ ఇంతమంది పార్టీలో ఉండటంతో విపక్షాలు బీఆర్ఎస్ ను కుటుంబపార్టీగా అభివర్ణిస్తుంటాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కవిత పోటీ చేయకపోవడం మేలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనికి తోడు కవితకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదని సమాచారం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కేవలం కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకున్నది. అక్కడ బీజేపీకి కాంగ్రెస్ కు పెద్ద మొత్తంలో సీట్లు ఉన్నాయి. మోడీ వేవ్ మళ్లీపనిచేస్తే మరోసారి బీజేపీ గెలిచే చాన్స్ ఉంది. దానికి తోడు బీజేపీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ దిశగా అడుగులు కూడా మొదలు పెట్టింది. గత ఎన్నికల్లో కవిత ఓడిపోవడంలో ఈ పసుపురైతులదే ముఖ్యపాత్ర. ఇప్పుడు కూడా వారు కవితకు సపోర్ట్ చేస్తారన్న గ్యారెంటీ లేదు. అన్ని ఆలోచించే కవిత వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఇక కవిత మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడాన్ని కేడర్ జీర్ణించుకోలేపోయింది. ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దానికి తోడు ఇప్పుడు కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒకవేళ ఆమె ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఓ పదవిలో ఉండగా .. ఇంకో సీటు కోసం పోటీ చేయడం ఎందుకున్న ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక కవిత కూడా ఈ సీటును మరో లీడర్ కు త్యాగం చేసి.. గెలుపు కోసం తాను కృషి చేస్తే ప్రజల్లో మంచి మార్పులు కొట్టేయచ్చు. అందుకే ఆమె పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.