వ్యూహం.. రిపీట్
- గులాబీ బాస్ కొత్త స్కెచ్
- పాతవ్యూహం మళ్లీ తెరపైకి
- లోక్ సభకు గులాబీ బాస్
- కార్యక్షేత్రంగా మహారాష్ట్ర
- నాందేడ్ లేదా ఔరంగాబాద్ ఎంపిక?
- గతంలో బలహీన ప్రాంతాల్లో కేసీఆర్ పోటీ
- తాజా వ్యూహం వర్కవుట్ అవుతుందా?
- ఉత్తరాదిన పాగా వేసేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్
ఇదేనిజం, స్పెషల్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ కొత్త స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వ్యూహాన్నే ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రయోగించబోతున్నట్టు టాక్. ఉద్యమ సమయంలో కరీంనగర్, మహబూబ్ నగర్ లో పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్.. తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ లోక్ సభ స్థానంలో పోటీచేయబోతున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన అనంతరం జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఏపీపై కూడా ఫోకస్ పెట్టినప్పటికీ.. ఆయన ప్రధానంగా మహారాష్ట్ర మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే పలువురు మహారాష్ట్రకు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కారు’ నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు.
మహారాష్ట్రపై ఫోకస్..
దేశవ్యాప్తంగా సత్తా చాటాలని చూస్తున్న కేసీఆర్ మహారాష్ట్రపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. తెలంగాణతో ఆ రాష్ట్రానికి సారూప్యత ఉండటంతో అక్కడి సమస్యలపై ద్రుష్టి సారించారు. అందుకోసం నాందేడ్ ఔరంగాబాద్ స్థానాన్ని ఆయన ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఆ రెండు నియోజకవర్గాల్లోని ముస్లిం ఓటర్లు కేసీఆర్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. గతంలో నాందేడ్ పరిధిలో ఎంఐఎం అభ్యర్థి సైతం గెలుపొందారు. దీంతో కేసీఆర్ కు ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.
తనయుడికి పట్టాభిషేకం
వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సీఎం కేసీఆర్.. తన కుమారుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కేటీఆర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి పరపతిని అనుభవిస్తున్నారు. అన్ని శాఖల్లోనూ ఆయన పరోక్ష జోక్యం ఉంది. దీంతో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసినా.. పెద్దగా పార్టీలో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. మరోవైపు కేటీఆర్ సీఎం కుర్చీ మీద కూర్చోవాలని చాలా రోజులుగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ చక్రం తిప్పాలని చూస్తున్నట్టు సమాచారం. మరి కేసీఆర్ వ్యూహం మహారాష్ట్రలో వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.