– జనగామ జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ విమర్శలు
– చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని హామీ
– రాష్ట్రంలో మత కలహాలు లేవని వెల్లడి
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ను బంగళాఖాతంలో కలపాలని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జనగామలోని మెడికల్ కాలేజీ గ్రౌండ్లో సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే..చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు కొన్ని జిల్లాలకు వెళ్తే ఏడుపొచ్చేదని, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే బాధనిపించేదని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున భవిష్యత్‌లో జనగామ అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నాయన్నారు.‘భవిష్యత్‌లో ఐటీ, పారిశ్రామికంగా జనగామ అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నాయి.
ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వెళ్తే ఊరిలో ఒక్క యువకుడు కనిపించలేదు. ఊరిలో యువకులంతా పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లారని తెలిసింది. ఇప్పుడు బచ్చన్నపేటలో 365 రోజులు నీళ్లు ఉంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మనది అగమ్య గోచర పరిస్థితి. ఆర్థిక నిపుణులను పిలిపించి రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించా. ఎంతో మేథోమధనం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాం. ఇవాళ తెలంగాణ నుంచి 2 నెలలపాటు వేలాది లారీల్లో ధాన్యం తరలివెళ్తోంది. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే దారినపడ్డారు. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలని ధరణి తెచ్చాం. రైతుల కష్టాలు తెలుసు కాబట్టి రెవెన్యూ అధికారుల అధికారాలను రైతు చేతిలో పెట్టాను. రైతు వేలిముద్ర లేకుండా భూమి జోలికి ఎవరూ పోలేరు’అని కేసీఆర్ తెలిపారు.
ఆపద మొక్కులు మొక్కేటోళ్లను నమ్మొద్దు ఆపద మొక్కులు మొక్కేటోళ్లను నమ్మొద్దని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ఓటు మన తలరాతను మార్చేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎంతో బలమైన ఆయుధం మన ఓటు. ఓటును ఎలా వేస్తామో.. మన కర్మ అలానే ఉంటుంది. మంచి, చెడు గుర్తించి ప్రజలు ఓటేయాలి. అలా చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు’ అని కేసీఆర్ అన్నారు. ‘ధరణి పోర్టల్‌ను తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని విపక్షాలు అంటున్నాయి. రైతుల మీద అధికారులను మళ్లీ రుద్దాలని విపక్షాలు చూస్తున్నాయి. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి.’అని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందువల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ‘మతకలహాలు లేకుండా శాంతిభద్రతలు బాగున్నాయి. కొందరు వచ్చి మతం పేరుతో విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు. తెలంగాణలో హిందూ, ముస్లింల మధ్య సోదరభావం ఉంది. గణేశ్ నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ వస్తే.. ఎవరూ అడగకుండానే ముస్లిం మత పెద్దలు ఒక రోజు వాయిదా వేసుకున్నారు.’అని కేసీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన పొన్నల లక్ష్మయ్య
కాంగ్రెస్‌లో 45 ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యానని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలోనే పలు రాజకీయ పార్టీలు కులగణనను తెరమీదకు తీసుకొస్తున్నాయని అన్నారు. కానీ, కేసీఆర్ సీఎం అయిన 3 నెలలకే కులగణన, సమగ్ర సర్వే చేపట్టారని గుర్తు చేశారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారని చెప్పారు. జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరానన్నారు.