కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్‌లను అనుమతించొద్దు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
నూతన చట్టాల్లోని నిబంధనలను విధిగా అమలు పరచాలని ఆదేశించారు.
వలస కార్మికుల పాలసీని రూపొందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ప్రగతి భవన్‌లో పట్టణ ప్రగతిపై అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలి
పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గ్రామాలు, పట్టణాల్లో రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసి పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
జులై చివరి నాటికి ప్రభుత్వ శాఖల మధ్య పేరుకుపోయిన బకాయిలను బుక్ అడ్జస్ట్‌మెంట్ ద్వారా పరిష్కరించాలి.
ఇకపై అన్ని శాఖల మధ్య వెంట వెంటనే బిల్లుల చెల్లింపులు జరగాలని చెప్పారు.
కనీసం ఐదు డంపు యార్డులు
భవిష్యత్ తరాలను, తెలంగాణ పట్టణాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి పట్టణంలో కనీసం ఐదు డంపు యార్డులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
పట్టణాలకు దగ్గరలో డంప్ యార్డులకు స్థలాలు సేకరించాలని సూచించారు.
హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, అందుకు అనుగుణంగా హెచ్ఎండీఏ పరిధిలో పరిసరాల పరిశుభ్రత చర్యలు చేపట్టాలన్నారు.
తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
లక్ష జనాభాకు వెజ్, నాన్ వెజ్ మార్కెట్
నూతన సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాలకు తరలుతున్నందున ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, ఆస్తులను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఆ స్థలాలను ప్రజా అవసరాల కోసం వినియోగించాలని తెలిపారు.
లక్ష జనాభాకు ఒకటి చొప్పున కనీసం 3 ఎకరాల స్థలంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించి పార్కింగ్, తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమాలో భాగంగా పట్టణాలను తీర్చిదిద్దుకునేందుకు 10 రోజుల సమయాన్ని సమర్థవంతంగా అధికారులు వినియోగించుకోవాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.