దిల్లీ : ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (Enforcement Directorate) దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. అరెస్టుకు దారి తీసిన కారణాలను కోర్టుకు వివరించారు. మంత్రులు, ఆప్ నేతలతో పాటు కేజ్రీవాల్ సూత్రధారి అని పేర్కొన్నారు. కేజ్రీవాల్ కనుసనల్లోనే మద్యం విధానం రూపకల్పన జరిగిందన్నారు. దిల్లీ మాజీ మంత్రి సిసోడియాతో నిత్యం సంప్రదింపులు జరిపేవారని చెప్పారు. సౌత్‌గ్రూప్‌కు, నిందితులకు కేజ్రీవాల్ మధ్యవర్తిగా ఉన్నారని తెలిపారు. సౌత్‌గ్రూప్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు కేజ్రీవాల్‌కు అందాయని వివరించారు. పంజాబ్ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ 100 కోట్లను సౌత్‌గ్రూప్ సభ్యుల నుంచి డిమాండ్ చేశారన్నారు.
” ఇది 100 కోట్ల స్కాం కాదు, 600 కోట్ల కుంభకోణం. ఆప్, సౌత్ గ్రూప్‌ల మధ్య విజయ్ నాయర్ వారధిగా ఉన్నారు. విజయ్ నాయర్ కంపెనీ నుంచి అన్ని ఆధారాలు సేకరించాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. రూ. 45 కోట్లు హవాలా ద్వారా గోవాకు పంపారు. చెన్నై నుంచి గోవాకి వయా దిల్లీ ద్వారా సరఫరా జరిగింది. మొత్తం నాలుగు రూట్‌ల ద్వారా డబ్బులు పంపారు. కేజ్రీవాల్ పాత్రపై కవిత నుంచి వాంగ్మూలం తీసుకున్నాం.” – Enforcement Directorate