తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతలుగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు అమలు చేశారు. అయితే అర్హులైన కొంత మంది రైతులకు రుణమాఫీ అందలేదు దీంతో ఆయా రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అలాంటి రైతుల కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. గ్రామాలు, మండల కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదని, అలాంటి రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారు. రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు. రైతు రుణమాఫీ విషయంలో మరో రూ. 13 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేస్తామన్నారు. రుణమాఫీకి అర్హులైన రైతుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.50 వేల కోట్లు కేటాయించామన్నారు. రైతులకు ఇప్పటికే రూ.లక్ష మాఫీ చేసినట్లు వెల్లడించారు. రూ.18 వేల కోట్లతో ఇప్పటికే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. మరో రూ.13 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని.. త్వరలోనే వాటిని కూడా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు.