సిబ్బంది కొరతను అధిగమించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 25 వేల ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయితే వీటికి దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధన ప్రకారం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు కూడా సూపర్‌వైజర్ల నుండి ట్రాక్‌మెన్ వరకు వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 65 ఏళ్ల లోపు వారు మాత్రమే ఇందుకు అర్హులని సమాచారం. వీరిని రెండేళ్ల కాలానికి నియమిస్తారు. అవసరమైతే పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మెడికల్ ఫిట్‌నెస్ మరియు పదవీ విరమణకు ముందు సర్వీస్‌లో ఉన్నప్పుడు వారి పనితీరు ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయి. గతంలో విజిలెన్స్ లేక శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్న వారు దరఖాస్తులకు అనర్హులని తేల్చినట్లు సమాచారం.