రైలు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్ మెయింటెనెన్స్, భద్రతను మెరుగుపరచడానికి చర్యలు చేపడుతున్నది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఇంటిగ్రేటెడ్ ట్రాక్ మానిటరింగ్ సిస్టమ్ (ITMS)ను పరిశీలించారు. దీని ద్వారా దేశంలోని రైల్వే నెట్ వర్క్ ను మానిటర్ చేస్తున్నారు. ఈ వ్యవస్థను మరింత అప్ డేట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ITMS అనేది గంటకు 20 కిలో మీటర్ల నుంచి 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ట్రాక్ పరిస్థితులను పర్యవేక్షించడానికి రూపొందించబడిన అధునాతన వ్యవస్థ. ఈ వెహికల్ లేజర్ సెన్సార్లు, హై స్పీడ్ కెమెరాలు, యాక్సిలరోమీటర్లు, GPSతో అమర్చబడి ఉంటుంది. ఇది రియల్ టైమ్ కాంటాక్ట్ లెస్ డేటా సేకరణ చేస్తుంది. రైల్వేస్ ట్రాక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (TMS)తో అనుసంధానించబడిన ITMS, ఎక్కడైనా ట్రాక్ లో లోపాలు ఉంటే వెంటనే SMS, ఇమెయిల్ ద్వారా వెంటనే హెచ్చరికలను జారీ చేస్తుంది.