– మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం
– కనుల పండువగా శోభాయాత్ర
– గల్లీ గల్లీ నుంచి నిమజ్జనానికి తరలిన గణనాథులు
ఇదే నిజం, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో గణనాథుల శోభాయత్ర, నిమజ్జన కోలాహలం మొదలైంది. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ సిటీలో ప్రతి గల్లీ నుంచి గణనాథులను మండపాల నిర్వాహకులు హుసేన్‌సాగర్‌కు తరలించారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. శోభాయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్ కీ.. జై’నినాదాలతో పరిస ప్రాంతాలు మార్మోగాయి. 6 గంటల పాటు కొనసాగిన ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న క్రేన్ నంబర్ 4కు చేరుకుంది.
అంతకుముందు సెక్రటేరియట్ ముందు యువత ఆటపాటలతో హంగామా చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు క్రేన్ నం.4 వద్ద మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. బడా గణేశ్ నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన వారితో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు లడ్డూ వేలం అనంతరం ఉదయం 11.30 గంటలకు బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర మొదలైంది. చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఫలక్‌నుమా, చార్మినార్, మొజంజాహి మార్కెట్ మీదుగా బాలాపూర్ గణనాథుడు హుస్సేన్‌సాగర్‌కు చేరుకోనున్నాడు. నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్- హుస్సేన్‌సాగర్ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.