ఇదేనిజం, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టేనని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారన్నారు. 2014, 18 ఎన్నికల్లో ఇదే జరిగిందని గుర్తు చేశారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబానికి మాత్రమే కాదని హెచ్చరించారు. బీఆర్ఎస్ తో పాటూ కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబపార్టీయేనని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రజలకు ఓట్లు వేయొద్దని సూచించారు.
తెలంగాణ తమ ఆస్తి అన్నట్టు కేసీఆర్ ఫ్యామిలీ వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవాలని కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ‘పేద ప్రజలకు మద్యం తాగిస్తూ.. ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. బెల్ట్ షాపుల పేరుతో బీఆర్ఎస్ సర్కారు ప్రజల రక్తం తాగుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులను రద్దు చేస్తుంది. ప్రజల ఆరోగ్యం రీత్యా మద్యాన్ని క్రమబద్దికరించాల్సిన అవసరం ఉంది. వేలాది మంది బీజేపీ లో చేరుతున్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీలో చేరండి, ఆశీర్వదించండి. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మెచ్చి ఆరేపల్లి మోహన్ బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. నిజమైన నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ‘‘అడ్డా కూలీలను తీసుకొచ్చి బీఆర్ఎస్ కండువాలు కప్పుతోందని సంజయ్ విమర్శించారు.