- త్వరలో ఎంపిక చేసే అవకాశం
- చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, వివాదరహితుడు
ఇదే నిజం, ఏపీ బ్యూరో: టీటీడీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ రావు(74) నియమితులు కాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయనను ముఖ్యమంత్రి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొనకళ్ల నారాయణ బీసీ వర్గానికి చెందిన నాయకుడు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. పైగా వివాదరహితుడు కూడా. ఆయన 2009, 2014 లో కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కొనకళ్ల నారాయణరావు లోక్‌సభలో ప్యానెల్ స్పీకర్‌గానూ పనిచేశారు. టీటీడీ చైర్మన్ పోస్ట్ కు ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిసిందే. ఈ పదవి కోసం మహామహులు పోటీపడ్డారు. కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజు, టీవీ5 అధినేత బీఆర్ నాయుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ సహా పలువురు సీనియర్ లీడర్లు ఈ పదవి కోసం ట్రై చేశారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం గౌడ్ సామాజికవర్గానికి చెందిన కొనకళ్లకు అవకాశం ఇచ్చారు. వైసీపీ హయాంలో ఈ పదవి చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తిరుమల పవిత్రత మీద కూడా విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రను కాపాడుతామని ప్రకటించారు. ఈ నేపపథ్యంలో తాజాగా కొనకళ్ల ఎంపిక ప్రాధాన్యం సంతరించుకున్నది.