– ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన ట్రిబ్యునల్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈనెల 6న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నదీ జలాల పంపకాలపై విచారణ అధికారాలను కేంద్రం నోటిఫై చేసింది. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని.. అందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరింది. అయితే, ఏపీ అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. నీటి పంపకాలపై వెంటనే విచారణ చేపట్టాలని ట్రిబ్యునల్‌ను తెలంగాణ కోరింది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ట్రిబ్యునల్ వాయిదా వేసింది. నవంబర్ 15వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై అభిప్రాయం చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నవంబర్ 22, 23వ తేదీల్లో ట్రిబ్యునల్ విచారణను చేపట్టనుంది.