చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తాం..
- మన బలం లేకుండా ఎవరూ ప్రధాని కాలేరు
– ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. అవసరమైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తుందని చెప్పారు. ఈ ఆలోచన కేసీఆర్ మదిలో ఉన్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. బీఆర్ఎస్ అందులో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా పవర్ లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. హౌసింగ్ కమ్ వర్క్ షెడ్డు కార్యక్రమాన్ని కూడా రద్దు చేసింది. పనికొచ్చే పథకాన్ని ఉంచకుండా రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. 75 ఏండ్లలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయని తప్పు ఈ ప్రధాని చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గమైన ప్రధాని మోదీ. మునుగోడు ఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో ఉత్తరాలు రాశాం. జీఎస్టీ ఎత్తేయాలని కోరాం. కేసీఆర్ కూడా చండూరు వేదికగా మోదీకి అభ్యర్థించారని కేటీఆర్ గుర్తు చేశారు.