ఇదేనిజం, స్టేట్ బ్యూరో: అమెరికాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తాజాగా రేవంత్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ (KTR) ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మూడు పంటలు కావాలో.. మూడు గంటల ఉచిత విద్యుత్ కావాలో రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. ‘‘కేసీఆర్ (KCR) నినాదం.. మూడు పంటలు. కాంగ్రెస్ (CONGRESS) విధానం.. మూడు గంటలు. బీజేపీ (BJP) విధానం.. మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? అనేది రైతులు తేల్చుకోవాలి. తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణమిది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘‘కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామన్నారు. ఇప్పుడు 3 గంటల విద్యుత్ చాలని.. రైతుకు మూడుపూటలా విద్యుత్ ఎందుకు అంటున్నారు. ముమ్మాటికీ ఇది సన్న, చిన్న కారు రైతును అవమానించడమే. నోట్లు తప్ప రైతుల పాట్లు తెలవని రాబందును నమ్మవద్దు. మరోసారి మూడు గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్ కావాలా? మూడు గంటల విద్యుత్ చాలన్న మోసకారి రాబందు కావాలో రైతులకు తెలుసు’’ అని కేటీఆర్ అన్నారు