KTR:2014 నుంచి పట్టణాల అభివృద్ధిపై ప్రతి ఏటా జూన్‌లో వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ దశాబ్ది నివేదికలో 2014 నుంచి సాధించిన ప్రగతిని పొందుపరిచామన్నారు. 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చింది. కొత్త పురపాలక చట్టం తెచ్చిన సీఎం కేసీఆర్‌దే ఈ ఘనత అని తెలిపారు. తొమ్మిదేండ్లలో పురపాలక శాఖ ద్వారా రూ. 1.21 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ పదేండ్లలో 462 శాతం ఎక్కువ ఖర్చు చేశామని తెలిపారు. ఈ పదేండ్లలో చట్టబద్దంగా రావాల్సింది తప్ప కేంద్రం రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. ఏ రంగం తీసుకున్నా గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని స్పష్టం చేశారు.
నగర అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. ఎస్ఆర్‌డీపీ ద్వారా 35 వరకు ఫ్లై ఓవర్లు నిర్మించామని గుర్తు చేశారు. ఉప్పల్, అంబర్‌పేట ఫ్లై ఓవర్లను జాతీయ హైవే సంస్థ పూర్తి చేయలేకపోతుందన్నారు. తాము 35 ఫ్లై ఓవర్లు పూర్తి చేస్తే, వాళ్లు 2 కూడా చేయలేకపోతున్నారు. హైదరాబాద్ నగరంలో 2050 నాటికి తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓఆర్ఆర్ పరిధిలో కూడా నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని కేటీఆర్ తెలిపారు.
సెప్టెంబర్ నాటికి ఎస్‌టీపీలు పూర్తి చేస్తామన్నారు కేటీఆర్. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేస్తున్నాం. అన్ని పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని పట్టణాల్లో ఇంటిగ్రెటేడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికే పలు చోట్ల ఈ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు.