Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

KTR letter to CM Revanth Reddy : బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. చేనేత పరిశ్రమలో నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. కక్షపూరిత విధివిధానాలతో నేతన్నలు నష్టపోతున్నారంటూ మండిపడ్డారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని X ద్వారా హెచ్చరించారు.

తెలంగాణ సర్కార్​కు చిత్త శుద్ధి, ముందు చూపు లేకపోవడంతో వేలాది మంది నేతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆరోపించారు. వారు ఉపాధి కోల్పోయి, జీవితాలు దుర్భరంగా మారుతున్నా ప్రభుత్వానికి కనీస కనికరం లేదని ఆక్షేపించారు. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకం ప్రతినిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ, సర్కార్​లో ఏమాత్రం చలనం లేకపోవడం అత్యంత దారుణమైన విషయమని కేటీఆర్ మండిపడ్డారు.

పదేళ్ల పాటు పండుగలా మారిన వస్త్ర పరిశ్రమ చుట్టూ మళ్లీ కాంగ్రెస్ రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమను దెబ్బతీయడంతో పాటు కార్మికుల జీవితాలతో చెలగాటమాడేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తీరు మార్చుకోవాలన్నారు. బీఆర్​ఎస్ సర్కార్ అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలని కేటీఆర్ తెలిపారు.

‘తమ ప్రభుత్వ హయాంలో కార్మికుల ఖాతాల్లో ప్రతి నెలా నేరుగా సూమారు రూ.3000ల వరకు పడేవి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత చేనేతమిత్ర కార్యక్రమం ఆగిపోయింది. మూలన పడిన సాంచాలను తిరిగి తెరిపించేందుకు పరిశ్రమకు రావాల్సిన రూ.270 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సొంత రాష్ట్రంలోని కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమిషన్లకు కక్కుర్తి పడి తమిళనాడు, సూరత్​కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోందని’ కేటీఆర్ ఆరోపించారు.

ఇప్పటి వరకు అందుతున్న అన్ని కార్యక్రమాలు అమలు కొనసాగించాలని కేటీఆర్ కోరారు. అవసరమైతే మరింత అదనపు సాయం అందేలా చూడాలన్నారు. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో వేల మంది నేతన్నల పొట్ట కొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వస్త్రపరిశ్రమపై ఆధారపడిన వేల మంది చేనేత కార్మికులు, కుటుంబ సభ్యులు మరింత సంక్షోభంలో కూరుపోతారని అవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సర్కార్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పొట్టకొడుతున్న కాంగ్రెస్​ను బడుగు,బలహీన వర్గాల నేతన్నలు ఎప్పటికీ క్షమించరని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img