– వివేక్ పోటీ చేస్తున్న చెన్నూరుకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
– రూ.50 లక్షలు సీజ్
ఇదే నిజం, హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ సంస్థలకు చెందిన ఉద్యోగులు భారీగా డబ్బును తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బైక్‌పై వస్తున్న వివేక్‌కు చెందిన వీ6 వెలుగు, విశాక సంస్థల ఉద్యోగులు ఇద్దరిని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. వారి దగ్గరున్న బ్యాగ్‌లో రూ.50 లక్షలను గుర్తించారు. ఆ ఇద్దరు ఉద్యోగులను ముదిగంటి ప్రేమ్ కుమార్, కంజుల రవి కిషోర్‌గా గుర్తించారు. ప్రేమ్ కుమార్ వెలుగు దిన పత్రికలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా, రవి కిషోర్ విశాక ఇండస్ట్రీస్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని తేలింది. తమ ఓనర్ వివేక్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చుల కోసం, లీడర్లను కొనేందుకు డబ్బును తరలిస్తున్నామని ఆ ఇద్దరు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు ఫైల్ చేశామన్నారు. వారి నుంచి డబ్బుతో పాటు రెండు సెల్ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.