వైద్యుడు దేవునితో సమానం అంటారు. ఎటువంటి పరిస్థితులలోనైనా వైద్యులు తమ వైద్య వృత్తిని పాటించాలి. ప్రజల ప్రాణాలను కాపాడటమే వైద్యుల ప్రథమ కర్తవ్యం కావాలి. ఇక ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటించి తనదైన ప్రత్యేకత చాటుకున్నారు తెలుగుదేశం పార్టీ నుండి దర్శి నియోజకవర్గానికి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి.
దర్శి మండలం అబ్బాయిపాలెంకు చెందిన వెంకట రమణ గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో దర్శిలోని ఓ ప్రవైటే ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో శస్త్రచికిత్స అవసరం పడింది. అయితే ఆసుపత్రికి చెందిన వైద్యులు చాలా దూరంలో ఉన్నారు. దీంతో ఏం చేయాలా ? అని ఆందరూ ఆందోళనలో ఉన్నారు.
దర్శికి 20 కిలోమీటర్ల దూరంలో టీడీపీ అభ్యర్థి, గైనకాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచారం నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు ఫోన్ చేసి గర్భిణి పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే ప్రచారం పక్కన పెట్టి ఆసుపత్రికి చేరుకున్న లక్ష్మి శస్త్రచికిత్స నిర్వహించి తల్లీ, బిడ్డలను కాపాడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంకటరమణ కుటుంబ సభ్యులు డాక్టర్ కు మనస్ఫూర్థిగా ధన్యవాదాలు తెలిపారు.