లెబనాన్ః లెబనాన్ రాజధాని బీరూట్‌లో పేలుళ్ల ఘటన మరచిపోకముందే పోర్టు ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పోర్టు సమీపంలోని కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందిగా లెబనాన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఆయిల్, టైర్లు నిల్వ ఉంచే ఓ గోడౌన్‌లో తాజా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి కార్మికులు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలను కొంత మంది నెటిజన్లు ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రమాద విషయం తెలియగానే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లెబనాన్ ఆర్మీ హెలికాప్టర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 4న బీరూట్ పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన గోడౌన్‌లో చోటు చేసుకున్న భయానక పేలుడు ఘటనలో 191 మంది మరణించిన విషయం తెలిసిందే.