Homeహైదరాబాద్latest Newsదగా, మోసం, కుట్ర.. రైతు భరోసాను బొందపెట్టేందుకు ఎత్తు..!

దగా, మోసం, కుట్ర.. రైతు భరోసాను బొందపెట్టేందుకు ఎత్తు..!

  • కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే కుట్ర చేస్తున్నారా?
  • గుట్టలు, రాళ్లు, వెంచర్లు అంటూ కొత్త రాగం!
  • పంట పండిస్తేనే పెట్టుబడి సాయమంటూ అర్థరహిత వాదన
  • మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొత్తడ్రామా?
  • వ్యవసాయాధికారులకు పెత్తనమిస్తే అవినీతి రాజ్యం
  • రైతు బంధు పథకంతో పెరిగిన పంట సాగు
  • తిరిగొచ్చి వ్యవసాయం చేసిన వలసజీవులు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సర్కారు మరో పెద్ద కుట్రకు తెరలేపింది. తెలంగాణ రైతును నిట్టనిలువునా ముంచేందుకు సిద్ధమైంది. కేసీఆర్​ ఆనవాళ్లు చెరిపివేయాలనే అర్థం లేని కుట్రతో రైతు నోటికాడిబుక్క లాగేయబోతున్నది. రైతు భరోసా పథకాన్ని మొత్తానికి నీరు గార్చాలని వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. రైతు బంధు కింద ఎకరాకు 10వేలే సాయం చేస్తున్నారు.. మేం పవర్​ లోకి వస్తే 15 వేలు ఇస్తామంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నమ్మబలికింది. కానీ పవర్​ లోకి వచ్చిన వెంబడే మాట మార్చింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడం, రైతుల్లో ఆగ్రహం వ్యక్తం కావడంతో 100 రోజుల్లో హామీని నెరవేరుస్తామంటూ కొత్త రాగం అందుకున్నది. ఇక చివరకు కేసీఆర్​ పల్లె పల్లెకు తిరిగి రైతు బంధు ఎందుకివ్వరు అని ప్రశ్నించడంతో కాంగ్రెస్ దిగివచ్చింది. నిజానికి రైతు బంధు విషయంలో కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచి చిన్న చూపే. రైతు బంధు పథకం అసలు అవసరమా? అంటూ పవర్​ లోకి వచ్చిన రెండో రోజో మూడో రోజో సీతక్క సన్నాయి నొక్కులు నొక్కారు. అప్పటికే రైతులకు కోపం వచ్చింది. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాననడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, తుమ్మల తలో మాట మాట్లాడటంతో రైతు బంధు మీద కాంగ్రెస్ వైఖరి ఏమిటో జనానికి మెల్లమెల్లగా అర్థమయ్యింది.

కేసీఆర్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
అసలు రైతు బంధు విషయంలో కాంగ్రెస్ గందరగోళ వైఖరిని అవలంభించింది. ఐదు ఎకరాలకు ఇద్దామా? పది ఏకరాలకు ఇద్దామా? అంటూ ఆలోచనలు చేసింది. పంట సాగు చేసేవాళ్లకే ఇద్దాం అంటూ కొత్త రాగం అందుకున్నది. దీంతో రైతులు అయోమయంలో పడిపోయారు. కేసీఆర్​ ఎంపీ ఎన్నికలకు మందు జనంలోకి వెళ్లారు. బస్సు యాత్రలో మాట్లాడుతూ.. రైతు బంధుకు కొర్రీలు ఎందుకు పెడతారు? పదెకరాల రైతు ఏం పాపం చేసిండు? ఆరు ఎకరాలు ఉన్నోడు.. ఏడు ఎకరాలు ఉన్నోడు ఎందుకు అర్హులు కారు అంటూ కేసీఆర్​ సంధించిన ప్రశ్న రైతుల్లో ఆలోచన రేకెత్తించింది. బస్సు యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. బెదిరిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రైతు బంధు సొమ్ము జమ చేసింది.

కొర్రీలు పెట్టేందుకు ఎత్తుగడలు
ప్రస్తుతం రైతు భరోసా కింద రైతులకు సాయం చేయడం కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ పథకం కింద డబ్బులు ఇస్తే కచ్చితంగా ఆ క్రెడిట్ కేసీఆర్​ కు పోతుంది. అందుకే ఈ పథకాన్ని నీరు గార్చాలని కాంగ్రెస్ చూస్తున్నట్టు అర్థమవుతున్నది. అందుకే తాజాగా రైతు భరోసా పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. కమిటీలో సభ్యులుగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీరంతా గతంలో రైతు భరోసా పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారే. ఇక రైతు బంధు పథకం రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్​ వెంచర్లకు ఉంది కాబట్టి వాటిని మినహాయిస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ సీలింగ్ పెట్టినా.. పంట వేసిన వాళ్లకే రైతు భరోసా ఇస్తామన్న కొన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ సీలింగ్ పెడితే రైతులు తమ పొలాలను భార్యలు, పిల్లల పేర్ల మీదకు మార్చుకొనే చాన్స్​ ఉంది. పంట వేసిన వాళ్లకే రైతు భరోసా ఇస్తామని చెప్పి.. ఎవరెవరకు ఏయే పంట వేశారో తెలుసుకొనేందుకు వ్యవసాయ అధికారులను నమ్ముకుంటే మళ్లీ అవినీతి రాజ్యమేలే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ హయాంలో రైతు బంధు నేరుగా రైతుల ఖాతాల్లో పడిపోయేది. అందుకే తెలంగాణ పల్లెలు మొత్తం పచ్చబడ్డాయి. బీడు భూములు సైతం సాగయ్యాయి. వ్యవసాయం వదిలేసి పట్నం బాట పట్టిన రైతులు మొత్తం మళ్లీ పల్లెలకు వచ్చారు. వ్యవసాయ రంగంల కళకళలాడింది. సాగు విస్తీర్ణం పెరగడమే అందుకు నిదర్శనం.

రాజకీయ ఆత్మహత్యే..
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయని అంటుంటారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నీరు గారిస్తే కచ్చితంగా ఆ పార్టీకి మూఢినట్టే. ఎందుకంటే గత పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా విషయంలో కొంత ఆలస్యం చేసింది. దీంతోనే రైతులు ఆగ్రహంచి కాంగ్రెస్ పార్టీని ఎనిమిది సీట్లకే పరిమితం చేశారు. అటువంటింది మొత్తానికి రైతు భరోసా ఉండదు.. ఈ పథకానికి అనేక కొర్రీలు పెడతారు. అని రైతులు భావిస్తే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కీలెరిగి వాత పెడతారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయం ఎంతో అనుకూలిస్తుంది. నిజానికి రైతు బంధు పథకం పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించింది. అంటే రైతు విత్తుకోకముందే అతడి అకౌంట్లో నగదు జమ అయితే అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఆ డబ్బు ఉపయోగపడుతుంది. అంతేకాని పంట వేశాక సాయం చేస్తే రైతుకు ఏ ఉపయోగం ఉండదు. ఈ సూక్ష్మాన్ని కాంగ్రెస్​ పార్టీ గ్రహించకుండా గుడ్డిగా ముందుకు వెళ్లినా.. రైతు భరోసా పథకం విషయంలో ఏ మాత్రం షరతులు విధించినా మొదటికే మోసం వచ్చే చాన్స్​ ఉంది.

Recent

- Advertisment -spot_img