అనకాపల్లి ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మోదీ ప్రసంగం ప్రారంభించడానికి వెళ్తుండగా.. అభిమానులు మోదీ..మోదీ అంటూ సభా ప్రాంగణాన్ని నినాదాలతో హోరెత్తించారు. జూన్ 4న రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. అనకాపల్లి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారి నిర్మించినట్లు తెలిపారు. 2014 వరకు రాష్ట్రంలో 4 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే..ప్రస్తుతం 8 వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు ఉన్నాయన్నారు. ఇక్కడి యువత కోసం పెట్రోలియం యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలను నెలకొల్పామని చెప్పారు. విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్‌కు అనుమతి ఇచ్చినా..రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో 21 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం సగం కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.