దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, 2వేలకు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి.
పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది.
ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
అయితే.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ముంబై నగరంలో సత్ఫలితాలనిచ్చింది.
ముంబైలో గతంతో పోల్చుకుంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది.
ఏప్రిల్ 4న ముంబైలో 11,163 కేసులు నమోదు కాగా.. శనివారం కేవలం 5,888 కరోనా కేసులే నమోదు కావడం గమనార్హం.
లాక్‌డౌన్ వల్ల ముంబైలో కరోనా వ్యాప్తి తగ్గిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 19న కూడా ముంబైలో 8000 కేసులు నమోదయ్యాయి.
కానీ.. కేవలం వారం రోజుల గడిచే సరికి 24 గంటల్లో 5,888 కరోనా కేసులే నమోదు కావడం ముంబై నగర ప్రజలకు కాస్త ఊరట కలిగించే విషయం.
పాజిటివిటీ రేట్ కూడా గత వారం 18 శాతం ఉండగా.. ప్రస్తుతం 15 శాతానికి పడిపోయింది.
శుక్రవారం ముంబైలో 7,221 కరోనా కేసులు నమోదు కాగా.. శనివారం 5,888 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
శుక్రవారంతో పోల్చుకుంటే శనివారానికి కొత్తగా నమోదయిన కేసుల సంఖ్య 20 శాతం తగ్గింది.
ముంబైలో లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్లనే కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు స్పష్టమవుతోంది.
ముంబై నగరంలో మొత్తం 120 కంటైన్మెంట్ జోన్లను ప్రభుత్వం గుర్తించింది.
అయితే.. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలను లాక్‌డౌన్‌గా చెప్పడంపై ఉద్ధవ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
గత సంవత్సరం విధించిన లాక్‌డౌన్ తరహా ఆంక్షలు మాత్రమే ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు చెప్పింది.
మే 1 వరకూ ముంబైలో కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంది.
మే 1 తర్వాత కూడా ఈ ఆంక్షలను పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫ్రంట్‌లైన్ వర్కర్లు ముంబైలో కరోనా బాధితుల కోసం రేయనక, పగలనకా శ్రమిస్తున్నారు.
ముంబైలో ఆదివారం నమోదైన కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా శనివారంతో పోల్చుకుంటే తగ్గింది.
ముంబైలో ఆదివారం కొత్తగా 5,192 కరోనా కేసులు, 46 కరోనా మరణాలు నమోదయ్యాయి.
శనివారంతో పోల్చుకుంటే ఆదివారం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య, మరణాల సంఖ్య మరింతగా తగ్గింది.
శనివారం కరోనా కారణంగా ముంబైలో 70 మంది చనిపోతే.. ఆదివారం ఈ సంఖ్య 46కు తగ్గింది. మొత్తంగా గమనిస్తే.. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఆశించిన ఫలితాలనే ఇస్తున్నాయని బీఎంసీ అధికారులు చెబుతున్నారు