– వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ
ఇదేనిజం, జోగిపేట : మాజీ మంత్రి బాబూమోహన్‌ను రాష్ట్ర ప్రజాశాంతి అధ్యక్షుడిగా నియమిస్తూ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఇటీవల ప్రకటించిన వీడియో వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. బాబూమోహన్ ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బాబూమోహన్ 1998, 1999, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందోలు ఎమ్మెల్యేగా గెలుపొంది, కార్మిక శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. 2018-23లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. చాలా కాలంగా తాను పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయాలని గత ఐదు సంవత్సరాలుగా బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీ నమ్మించి చేసిందని ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర బాధ్యతలతో పాటు వరంగల్ ఎంపీ స్థానం నుంచి పార్టీ తరపున పోటీ చేస్తారని కూడా కేఏపాల్ ప్రకటించడం విశేషం.
వరంగల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె పలు ఆరోపణలు చేస్తూ పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించడంతో బీఆర్‌ఎస్ తరపున బాబూమోహన్ పేరును బీఆర్‌ఎస్ పరిశీలిస్తున్నట్లు, కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో బాబూమోహన్ కుటుంబ సభ్యులు కొట్టి పారేశారు. రెండు రోజుల ముందే ప్రజాశాంతి అధ్యక్షుడిగా నియమితుడై, ఎంపీ అభ్యర్థిత్వాన్ని కూడా కేఏపాల్ ఖరారు చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. క్రిస్టియన్‌లు ఎక్కువ శాతం ఉన్న వరంగల్ లోక్‌సభ పరిధిలో కేఏపాల్ కూడా ప్రచారం చేస్తారని బాబూమోహన్ కూడా ప్రకటించారు. వైజాగ్ ఎంపీ ఎన్నికల్లో కేఏపాల్ పోటీ చేస్తుండగా ఆయనకు మద్దతుగా బాబూమోహన్ కూడా ప్రచారం చేయనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. ఎట్టకేలకు బాబూమోహన్‌కు వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం లభించడంతో ఆయన వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు