ఇదే నిజం, ఏపీ బ్యూరో: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఉదయం మోహినీ అవతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై స్వామివారు విహరించనున్నారు. గరుడోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్న నేపథ్యంలో తితిదే విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గురువారం సర్వదర్శనం టోకెన్ల జారీని బుధవారం రాత్రి నుంచి రద్దు చేసింది. శ్రీవారి గరుడసేవ నేపథ్యంలో 3,400 మంది పోలీసులతో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి, టీటీడీ సీవీఎస్‌వో నరసింహకిశోర్ తెలిపారు.