– చంద్రగ్రహణం తర్వాత
నేటి ఉదయం 9 గంటల నుంచి యధావిధిగా దర్శనాలు
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆలయాలను శనివారం మూసివేశారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేశారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరిగి ఆలయాన్ని ఆదివారం ఉదయం వేకువ జామున తెరిచి.. సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి యథావిధిగా భక్తులను దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం అర్చకులు, అధికారులు మూసివేశారు. ఆదివారం శుద్ధి, సంప్రోక్షణ తర్వాత భక్తులను ఆలయంలో స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ పాక్షిక చంద్రగ్రహణం దాదాపు గంటన్నర వరకు కొనసాగింది.