Homeహైదరాబాద్latest Newsమల్లారెడ్డి పెద్ద స్కెచే వేశాడుగా..

మల్లారెడ్డి పెద్ద స్కెచే వేశాడుగా..

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. మల్కాజిగిరి పార్లమెంటు బరిలో దిగాలని చూస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇటీవలే తన మనసులో మాటను కూడా బయటపెట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సైతం ఇక్కడ మల్లారెడ్డి కంటే బెటర్ చాయిస్ లేదు. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని మల్కాజిగిరి స్థానంలో గెలిపించుకున్నారు. మల్లారెడ్డికి మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మంచి పట్టు ఉండటంతో కచ్చితంగా ఎంపీ టికెట్ ఆయనకే వచ్చే అవకాశం ఉంది. అయితే మల్లారెడ్డి ఒకవేళ మల్కాజిగిరి ఎంపీగా గెలిస్తే.. ఖాళీ అయ్యే మేడ్చల్ అసెంబ్లీ బరిలో ఎవరు పోటీ చేస్తారన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ సీటులో సైతం మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డిని బరిలో దించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం కూడా ఆమెకు టికెట్ కేటాయించే అవకాశముంది. గత ఎన్నికల సమయంలో మల్లారెడ్డి.. మల్కాజిగిరి అసెంబ్లీ సీటు మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అక్కడ మైనంపల్లి బరిలో దిగడంతో పార్టీ హైకమాండ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దీంతో మల్లారెడ్డి తానే పోటీ చేసినట్టుగానే భావించి తన అల్లుడిని గెలిపించుకున్నారు. ఇక తన కోడలు ప్రీతిరెడ్డి మేడ్చల్ సెగ్మెంట్‌లో పనిచేశారు. నియోజకవర్గ ప్రజలు, నేతలతో ఆమె సత్సంబంధాలు కొనసాగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి గెలుపు కోసం ఆయన కోడలు ప్రీతిరెడ్డి డైనమిక్‌గా పనిచేసింది. దీంతో ఆమెకు ప్రజల్లో మంచి పేరు వచ్చింది. దీంతో ఒకవేళ మల్లారెడ్డి ఎంపీగా గెలిస్తే కొడలికే ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించుకొనే ప్రయత్నం చేస్తారు. సహజంగా ఒక లీడర్ నియోజకవర్గం మారితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉంటుంది. అయితే మల్లారెడ్డి అటువంటి అవకాశం ఇవ్వకుండా తన సొంత పార్లమెంటు సీటులోనే పోటీ చేస్తున్నారు. దీనికి తోడు తన కోడలికే టికెట్ ఇస్తున్నారు. మరి ప్రజలు మల్లారెడ్డిని గెలిపిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.

కాంగ్రెస్ కు ఎంతో ప్రతిష్ఠాత్మకం…
కాంగ్రెస్ పార్టీకి మల్కాజిగిరి సిట్టింగ్ సీటు. గత ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీగా గెలుపొందారు. దీంతో ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మకం. అంతేకాక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి బరిలో దిగి ఓడిపోయిన మైనంపల్లి హన్మంత్ రావుకు టికెట్ ఇవ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. అదే జరిగితే ఇక్కడ పోటీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగే అవకాశం ఉంది. ఇటు మల్లారెడ్డి స్థానిక లీడర్. ఇక మైనంపల్లి సైతం గతంలో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు కనక ఆయనకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీటిలో పెద్దగా సీట్లు సాధించలేదు కనక ఎలాగైనా మల్కాజిగిరి ఎంపీ బరిలో నిలిచి గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి మల్కాజిగిరి సీటు ఎంతో హాట్ గా మారింది. ఇక ఇక్కడ బీజేపీ నుంచి కూడా చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నారు. ఈటల రాజేందర్, జాతీయ నేత మురళీధర్ రావు ఈ సీటులో పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో మల్కాజిగిరి సీటు హాట్ సీటుగా మారే చాన్స్ ఉంది. అయితే 2014లో ఇదే మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావుపై మల్లారెడ్డి గెలిచిన చరిత్ర ఉంది.

Recent

- Advertisment -spot_img