ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ భవనం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు శ్రేణులతో బయలుదేరిన మందకృష్ణ మాదిగను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులకు, ఎమ్మార్పీఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం.. మందకృష్ణ మాదిగను గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు.. ఎమ్మార్పీఎస్ శ్రేణులను నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.