టాలీవుడ్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మంగళవారం’. ఈ చిత్రం 16వ ప్రతిష్టాత్మక జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో సత్తా చాటింది. ఉత్తమ నటి, ఉత్తమ సౌండ్ డిజైన్, ఉత్తమ ఎడిటింగ్‌తో పాటు మొత్తం నాలుగు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ అధికారికంగా ప్రకటించారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత ఏడాది నవంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డులు గెలిచిన వారి పేర్లు చూసుకుంటే.. ఉత్తమ నటిగా పాయల్ రాజపుత్ అవార్డు గెలుచుకోగా.. ఉత్తమ సౌండ్ డిజైనర్‌గా రాజా కృష్ణన్, ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో గుళ్ళపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ముదసర్ మొహమ్మద్ అవార్డులు గెలుచుకున్నారు.