మణిపూర్ లో ఆగని హింస
- కొనసాగుతున్న జాతుల వైరం
- మైతేయి వర్గానికి చెందిన వారు మ్రుతి
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: మణిపూర్ లో అల్లర్లు, హింస ఆగడం లేదు. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతోన్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిష్ణుపుర్ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ హింస చెలరేగింది. మృతిచెందిన వారు క్వాక్టా ప్రాంతంలోని మైతేయి వర్గానికి చెందిన వారని తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి వీరు తమ ఇళ్లకు కాపాలా కాస్తుండగా గుర్తుతెలియని దుండగులు వీరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తండ్రీకుమారుడితో పాటు మరో వ్యక్తి మరణించారు. నిందితులను మిలిటెంట్లుగా అనుమానిస్తున్నారు. కేంద్ర భద్రతా దళాల బఫర్‌జోన్‌ను దాటుకుని దుండగులు గ్రామంలోకి చొరబడి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.