Homeహైదరాబాద్latest NewsMarriage : పెళ్లికి ముందే వివాహేతర సంబంధం.. పెళ్లైన నెలకే ప్రియుడి మోజులో కట్టుకున్నవాడిని కడతేర్చిన...

Marriage : పెళ్లికి ముందే వివాహేతర సంబంధం.. పెళ్లైన నెలకే ప్రియుడి మోజులో కట్టుకున్నవాడిని కడతేర్చిన భార్య

Marriage : జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ గంట తేజేశ్వర్ (32) హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ హత్య వెనుక భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి కుట్ర ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.
తేజేశ్వర్‌కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో 2025 ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. అయితే, పెళ్లికి ఐదు రోజుల ముందు ఐశ్వర్య అదృశ్యమై, కర్నూలులోని ఓ బ్యాంకు ఉద్యోగి వద్దకు వెళ్లినట్లు అనుమానించారు. ఫిబ్రవరి 16న తిరిగి ఇంటికి వచ్చిన ఆమె, తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడి, తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇబ్బందుల కారణంగా స్నేహితురాలి ఇంటికి వెళ్లానని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన తేజేశ్వర్, మే 18న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత, ఐశ్వర్య నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ భర్తను పట్టించుకోకపోవడంతో రెండో రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వడంతో అతని సోదరుడు తేజవర్థన్ గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా, కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద తేజేశ్వర్ మృతదేహం లభించింది.

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత, కర్నూలులోని ఓ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తూ, అదే బ్యాంకులోని ఓ ఉద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నాడు. తేజేశ్వర్‌తో పెళ్లి తర్వాత ఐశ్వర్య ఆ ఉద్యోగితో 2,000 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు.
తమ సంబంధానికి తేజేశ్వర్ అడ్డుగా ఉన్నాడని, అతని ఆస్తి కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక, తన డ్రైవర్‌ను కూడా పంపినట్లు సమాచారం. జూన్ 17న కొంతమంది తేజేశ్వర్‌ను 10 ఎకరాల పొలం సర్వే కోసం కారులో తీసుకెళ్లి, మార్గమధ్యలో కత్తులతో దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని సుగాలిమెట్టు వద్ద పారవేశారు. ప్రస్తుతం ఐశ్వర్య, సుజాతను పోలీసులు అరెస్టు చేయగా, బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. గద్వాల పోలీసులు కీలక నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ కేసు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Recent

- Advertisment -spot_img