కరోనా కాలంలో జ్వరం వచ్చిందంటే చాలు హడలిపోతున్నాం.
డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా తదితర వ్యాధులు వచ్చేందుకు ప్రధాన కారణం దోమలే.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు దోమల బెడద మరింత పెరిగింది.
ముఖ్యంగా మురికి కాలువలు, డ్రైనేజీలు, ఓపెన్ నాలాలు, చెరువులు, కుంటలు సమీపంలో ఉన్న బస్తీలు, కాలనీలలో నివసించే వారుకు దోమలతో సహవాసం చేయాల్సిందే.
దోమల నివారణకు మార్కెట్‌లో ఎన్ని మందులు ఉన్నా ఇంట్లో ఉండే సహజమైన పదార్థాలతోనే దోమల నుంచి రక్షణ పొందేందుకు అవకాశం ఉంది. ఆ వివరాలు మీ కోసం..
కాఫీ పొడితో దోమ లార్వా మటాష్
కాఫీ పొడితో అనేక ఉపయోగాలు ఉన్న విషయం తెలిసింది.
అదే విధంగా నిల్వ నీటిలో దోమల లార్వాలను మట్టుబెట్టేందుకు సైతం కాఫీ పొడి ఉపయోగపడుతుంది.
మీ ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటిలో కాస్తా కాఫీ పొడిని వేస్తే దోమ లార్వాలు మటాష్ అవుతాయి. దోమల వృద్ధి అంతటితో ఆగిపోయి వాటి బెడద తప్పుతుంది.
లావెండర్ నూనెతొ..
లావెండర్ నూనె వాసన దోమలు అసలు తట్టుకోలేవు. ఇంట్లో లావెండర్ నూనెను పిచికారీ చేస్తే దోమలు దరిచేరవు.
దోమలు ఎక్కవగా కరిచే చేతులు, కాళ్లకు లావెండర్ నూనెను రాసుకుంటే మేలు.
వెల్లుల్లి గాఢతతో..
వెల్లుల్లి గాఢతకు దోమలు ఇంటి బయటే ఉండాల్సిందే. కొన్ని వెల్లుల్లి రెమ్మలను తీసుకోని వాటిని దంచి కొన్ని నీళ్లలో మరిగించాలి.
ఆ నీళ్లను గదిలో స్ప్రే చేస్తే ఆ వాసనకు దోమలు ఇంట్లోకి వచ్చేందుకు జంకుతాయి.
కర్పూరంతో దోమలు పరార్
దేవుడికి హారతి ఇచ్చేందుకు వినియోగించే కర్పూరం వాసన అంటే దోమలకు అసలు పడదు.
ఓ ప్లేటులో కర్పూరాన్ని తీసుకొని ఓ గదిలో పెట్టి తలుపులు వేయాలి. అలా ఓ 30 నిమిషాలు వదిలేస్తే దోమల పరార్ అవుతాయి.
పుదీనాతో ఆమడ దూరం
పుదీనాలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని తెలసుకదా. పుదీనా ఆకులంటే దోమలు పారిపోవాల్సిందే.
ఇంట్లో ఏదో ఒక మూల పుదీనా ఆకుల్నిపెడితే దోమలు పరారు అవుతాయి. పుదీనా ఆయిల్ కూడా మార్కెట్‌లో దొరుకుతుంది.