– ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న రాజగోపాల్ రెడ్డి
– హస్తం పార్టీలో చేరిన మోత్కుపల్లి, నీలం మధు
– పటాన్ చెరు టికెట్ కేటాయింపుపై సస్పెన్స్
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో మరోసారి చేరికల జోష్ పెరిగింది. బీజేపీకి రాజీనామా చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ సైతం కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్ నుంచి పటాన్ చెరు టికెట్ ఎవరికి?
నీలం మధు బీఆర్ఎస్ నుంచి పటాన్ చెరు టికెట్ ఆశించి భంగపడ్డ సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్‌గా నీలం మధు పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో పటాన్ చెరు సెగ్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నీలం మధు.. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే పటాన్చెరు టికెట్ కేటాయించింది. దీంతో నీలం మధు రెబల్‌గా మారి పార్టీకి రాజీనామా చేశారు. తన వర్గంతో రాష్ట్రంలోని ముదిరాజ్‌లను ఏకం చేసి, టికెట్ ఇవ్వాలని సభలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీ పునరాలోచిస్తుందని భావించాడు. అయినా, బీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పటాన్ చెరు టికెట్‌ను మధు ఆశిస్తున్నారు. తనకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్ పటాన్ చెరు ఇన్ చార్జిగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఎప్పటినుంచో పటాన్ చెరు టికెట్‌ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌లో తన పేరు ఉంటుందని కాట శ్రీనివాస్ గౌడ్ ధీమాగా ఉన్న తరుణంలో నీలం మధు పార్టీలో చేరడంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో పటాన్చెరు టికెట్ కేటాయింపుపై సస్పెన్స్ నెలకొంది.