హైదరాబాద్ : లంచం తీసుకున్న కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నగేష్‌తో పాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణా రెడ్డి, చల్పిచేడు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, సర్వేల్యాండ్ రికార్డ్ జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిందరికీ వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం హైదరాబాద్ తరలిస్తున్నారు. భూ వివాదం కేసులో లంచం తీసుకుంటూ నగేస్ పట్టుబడిన విషయం తెలిసిందే.
రూ.1.12 కోట్ల డీల్
శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఫిర్యాదుతో అవినీతి డొంక కదిలింది. నిషేధిత భూముల జాబితాలో ఉన్న 112 ఎకరాల భూమికి ఎన్‌వోసీ కోసం బాధితుడు వెళ్ళాడు. ఎన్ఓసీ ఇచ్చేందుకు జులై 31న మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌కు రూ.1 కోట్ల 12 లక్షలు మేరకు డీల్ కుదుర్చుకున్నాడు. ఎకరానికి లక్ష రూపాయిల చొప్పున ముట్టచెప్పేందుకు ఒప్పందం కుదిరింది. మొదట విడతగా ఫిర్యాదుదారుడి నుండి రూ.19.5 లక్షలు అడిషనల్ కలెక్టర్ తీసుకున్నారు. ఆగస్ట్ 7న మరోసారి రూ. 20.5 లక్షలు వసూలు చేశాడు. మిగిలిన రూ.72 లక్షలకుగాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ కోలా జీవన్ గౌడ్ పేరిట సేల్ అగ్రిమెంట్ చేయించాడు. జూలై 31న జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి రూ.5 లక్షలు తీసుకోని అందులోంచి రూ.లక్ష రూపాయిలు ఆర్డీవోకి, మరో రూ.లక్ష తహసీల్దార్‌కు అందజేశాడు. ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి రూ.28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు పలు భూ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.