– మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థికి బ్యాడ్ ఇమేజ్
– ప్రజల్లో పలుకుబడి జీరో..
– పైగా తీవ్రమైన వ్యతిరేకత
– వెంకట్రామిరెడ్డి పేరు చెబితేనే మండిపడుతున్న కేడర్
– కేసీఆర్, ఇమేజ్ బీఆర్ఎస్ బలం కలిసొస్తుందా?
– కలెక్టర్గా పనిచేసినా జనంలో వ్యతిరేకతే ఎక్కువ
– భూ సేకరణ పేరుతో కర్కశంగా వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి
– ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలోనూ అవినీతి ఆరోపణలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచే సీటు ఏదైనా ఉందా? ఆ పార్టీ కేడర్ ఠక్కున చెప్పే ఆన్సర్ మెదక్. ఆరు నూరైనా మెదక్ గులాబీ ఖాతాలో పడటం ఖాయమని వారు చెబుతుంటారు. ఇక గులాబీ బాస్ సొంత ఇలాఖా కావడం.. హరీశ్ రావు సెగ్మెంట్ కూడా ఈ పార్లమెంటు పరిధిలోనే ఉండటంతో మెదక్ మీద జెండా పాతడం తమకు మంచినీళ్ల ప్రాయమని బీఆర్ఎస్ లీడర్లు చెబుతుంటారు.. అయితే ఇప్పుడు ఈ ఇక్కడ అభ్యర్థి విషయమే పెద్ద సమస్య అయ్యింది. మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆర్థికంగా బలమైన నేత అనే ఒకే ఒక్క కారణంతో అధిష్ఠానం ఆయనను ఎంపికచేసినట్టుంది.. కానీ వెంకట్రామారెడ్డికి సెగ్మెంట్లో పరిస్థితి అంత బాగున్నట్టు లేదు. ఆయన కాకుండా ఇంక ఎవరు ఇక్కడ నిలబడ్డ గెలిచేవారే అన్న అభిప్రాయం కేడర్ లో కనిపిస్తోంది.
మాస్ లీడర్ కాదు.. క్లాస్ లీడర్ కూడా కాదు..
జనంలో తిరుగులేని ఇమేజ్ ఉన్న లీడర్ కు టికెట్ ఇస్తే.. పార్టీ బలం కూడా వారికి తోడేతే గెలుపు సునాయాసం అవుతోంది. ఒక్కోసారి ఏ ఇమేజ్ లేని లీడర్ కు టికెట్ ఇచ్చినా పార్టీ ఊపుతో గెలుస్తారు.. కానీ స్ట్రాంగ్ ప్లేస్ బ్యాడ్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని బరిలో దించితే అక్కడ కోరి ఇబ్బందులు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి విషయంలో అదే కనిపిస్తోంది. మెదక్ సెగ్మెంట్ లో కేసీఆర్, బీఆర్ఎస్ అభిమానులకు కొదవలేదు.. వారంతా గుడ్డిగా గులాబీ పార్టీకి మద్దతు ఇస్తారు కానీ.. కానీ ఇక్కడ వెంకట్రామిరెడ్డి అభ్యర్థి కావడంతో బీఆర్ఎస్ సాధారణ కార్యకర్తల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది..
ఆఫీసర్ గా ఉండి ప్రజలకేమేనా మేలు చేశారా?
గతంలో వెంకట్రామారెడ్డి కలెక్టర్ గా ఉన్నారు.. కానీ ప్రజల్లో పెద్దగా ఆయనకు ఇమేజ్ లేదు. పైగా వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ హయంలో మెదక్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.. అప్పుడు భూ సేకరణ చేయాల్సి వచ్చింది. కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డి భూ సేకరణ విషయంలో కర్కశంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల మెప్పుపొందేందుకు ఇష్టారాజ్యంగా భూ సేకరణ చేశారు.. అవసరమైతే పోలీస్ ఫోర్స్ పెట్టి నిర్వాసితుల పట్ల నిర్దాక్షణ్యంగా వ్యవహరించారు. దీంతో వారంతా రగిలిపోతున్నారు. వెంకట్రామిరెడ్డి స్థానికుడు నిత్యం అందుబాటులో ఉంటారని భావిస్తే జనం ఆదరించేవారేమో.. కానీ ఆయన పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి. కేసీఆర్ ఇంటిమనిషి.. పాదాభివందనం చేసి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఇక బీఆర్ఎస్ హయాంలో పదవులు అడ్డుపెట్టుకొని అవినీతి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలోనూ కీలక అధికారికి ఉండి భారీ అవినీతికి తెరలేపాడన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన రాధాకిషన్ రావు సైతం వెంకట్రామిరెడ్డి పేరు చెప్పడం గమనార్హం. వెరసి ఈయన అవినీతే ముందుకు వస్తుంది తప్ప.. చేసిన మంచి కనిపించడం లేదు.. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం.. హరీశ్ రావు ఈ సెగ్మెంట్ కు ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తుండటంతో వారంతా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఫుల్ ఫోకస్ చేస్తే తప్ప వెంకట్రామిరెడ్డి గెలిచే పరిస్థితి లేదు. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్త వెంకట్రామిరెడ్డి ఫ్లెక్సీకి చెప్పులదండ వేశారంటే ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్యకర్తలు సైతం ఇప్పుడు మనస్ఫూర్తిగా పనిచేయలేని పరిస్థితి ఉంది.