తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెలాఖరు వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11వ తేదీ మధ్యలో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీ నాటికి ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.