MLC Kavitha : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్ పాస్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బస్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. బస్ పాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ గేటు ముందు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్ పాస్ ఛార్జీల పెంపు విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని కవిత ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన సమయంలో పోలీసులు ఎమ్మెల్సీ కవితతో పాటు జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిని వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్సీ కవితను కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం బస్ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.