HomeజాతీయంModi Like Bipin Rawat : బిపిన్ రావత్ అంటే మోదీకి ఎందుకంత ఇష్టం

Modi Like Bipin Rawat : బిపిన్ రావత్ అంటే మోదీకి ఎందుకంత ఇష్టం

Modi Like Bipin Rawat : బిపిన్ రావత్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం

Modi Like Bipin Rawat – ”జనరల్‌ బిపిన్ రావత్ అద్భుతమైన సైనికుడు.

నిజమైన దేశభక్తుడు, సైన్యాన్ని ఆధునీకరించడంలో కీలకమైన పాత్ర పోషించారు.

వ్యూహాలలో ఆయన అనుసరించే విధానాలు సాటిలేనివి. ఆయన సేవలను భారతదేశం ఎప్పటికీ మరచిపోదు”.

ఇవి జనరల్ బిపిన్ రావత్ సంతాప సందేశంలో ప్రధాని మోదీ పేర్కొన్న మాటలు.

2016 డిసెంబరు 31న జనరల్ బిపిన్ రావత్‌ కు ఆర్మీ కమాండ్‌ని అప్పగించినప్పుడు ప్రధాని మోదీ ఆయనను ఎంతగానో విశ్వసించారు.

జనరల్ రావత్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ కావడం సాధారణ ప్రక్రియ కాదు.

ఇద్దరు సీనియర్ అధికారుల సీనియారిటీని పట్టించుకోకుండా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

సంప్రదాయం ప్రకారం అప్పట్లో చీఫ్ ఆఫ్ ఆర్మీ పదవి ఈస్టర్న్ కమాండ్ చీఫ్ జనరల్ ప్రవీణ్ బక్షి, సదరన్ కమాండ్ చీఫ్ పి.మహమ్మదాలి హరీజ్‌లకు సీనియారిటీ ప్రకారం రావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు.

సీనియారిటీని పక్కనబెట్టి….

మోదీ ప్రభుత్వం చీఫ్ ఆర్మీ స్టాఫ్ నియామకం విషయంలో సీనియారిటీని పక్కనబెట్టి జూనియరైన జనరల్ రావత్‌కు ప్రాధాన్యత ఇచ్చింది.

భారతదేశ భద్రతకు సంబంధించిన ప్రస్తుత సవాళ్లను జనరల్ రావత్ ఎదుర్కోగల సమర్థుడని పలువురు నిపుణులు కూడా పేర్కొన్నారు.

సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతంలో సైనిక కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడంలో జనరల్ రావత్‌కు మూడు దశాబ్దాల అనుభవం ఉండటంతో, అప్పట్లో ప్రభుత్వం ఆయనవైపు మొగ్గు చూపింది.

ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటును నియంత్రించడంలో, మియన్మార్‌లోని తిరుగుబాటు శిబిరాలను నిర్మూలించడంలో జనరల్ రావత్ ముఖ్యమైన పాత్ర పోషించారు.

1986లో చైనాతో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, జనరల్ రావత్ బెటాలియన్‌కు కల్నల్ కమాండింగ్‌ గా ఉన్నారు.

జనరల్ రావత్ అనుభవానికి ప్రధాని మోదీ ఆకర్షితులయ్యారని, అందుకే సీనియారిటీని పక్కనబెట్టి రావత్‌ను ఆర్మీ చీఫ్‌ గా చేశారని చెబుతారు.

అయితే, ఇలా సీనియారిటీని పక్కనబెట్టి ఆర్మీలో ఉన్నత పదవులు కట్టబెట్టడం ప్రధాని మోదీతోనే ప్రారంభం కాలేదు. గతంతో ఇందిరా గాంధీ కూడా ఇదే విధంగా వ్యవహరించారు.

ఎర్రకోట నుండి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవీ ప్రకటన

2019 ఆగస్టు 15న 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళాల మధ్య మెరుగైన సమన్వయం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

”ఇప్పుడు సైన్యంలో సంస్కరణలు అవసరం. సైనిక వ్యవస్థను మెరుగుపరచాలంటూ అనేక నివేదికలు వచ్చాయి.

మన త్రివిధ సైన్యాల మధ్య సమన్వయం ఉంది. కానీ, ప్రపంచం మారుతున్నందున, ఈ రోజు సాంకేతికత ఆధారిత వ్యవస్థను తయారు చేస్తున్నారు.

మారుతున్న యుద్ధం స్వభావం, భద్రతకు అనుగుణంగా మన సైన్యం ఉండాలి.

అందుకే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం” అని మోదీ ప్రకటించారు.

ఈ పదవికి జనరల్ రావత్‌ను ప్రధాని మోదీ ఎంచుకున్నారు.

దీంతో ఆయన భారతదేశపు మొట్టమొదటి చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌ అయ్యారు.

డిసెంబర్ 31, 2019న ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేసి సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు.

జనరల్ రావత్ ఆర్మీ చీఫ్ అయ్యాక..కొన్ని నెలల్లోనే డోక్లామ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

డోక్లామ్ భూటాన్‌లో ఉంది. చైనా అక్కడ సైనిక స్థావరాలను నిర్మిస్తోంది. భారత్ తన సైన్యాన్ని అక్కడ మోహరించింది.

ఆ సమయంలో ఆర్మీ చీఫ్‌గా జనరల్ రావత్ దూకుడుగా వ్యవహరించినట్లు చెబుతారు.

టూ అండ్ ఏ ఆఫ్ ఫ్రంట్ వార్

డోక్లామ్ సంక్షోభం సమయంలో జనరల్ రావత్ టూ అండ్ ఏ ఆఫ్ ఫ్రంట్ వార్‌కు భారతదేశం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

చైనా, పాకిస్తాన్ సమస్యలతో పాటు అంతర్గతంగా జరిగే ఘర్షణలను టూ అండ్ ఏ ఆఫ్ ఫ్రంట్ వార్ ఫ్రంట్ గా చెబుతారు.

జనరల్ రావత్ చేసిన ఈ ప్రకటనపై చైనా నుంచి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.

అయితే, జనరల్ రావత్ ప్రకటనలో కొన్నిసార్లు లోపాలు కూడా కనిపించేవి.

యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది అన్నిసార్లు సులభం కాదని దౌత్యాన్ని ఆశ్రయించవలసి ఉంటుందని చాలామంది రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీ జనరల్ రావత్‌ను ఎందుకు అంతగా విశ్వసించారు?(Modi Like Bipin Rawat)

”జనరల్ రావత్‌కు ఈ పదవిని అప్పగించడం చాలా కీలకమైన విషయం, చాలా సులభం కూడా.

సైనిక సంస్కరణలు, రక్షణ ఆర్థిక వ్యవస్థ, త్రివిధ దళాలలో సమన్వయం కోసం జనరల్ రావత్‌ ను ఉపయోగపడతారని మోదీ భావించారు” అని రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేడీ అన్నారు.

“మోదీ ఆయనను విశ్వసించడానికి సైద్ధాంతిక సాన్నిహిత్యం కూడా ఒక కారణం.

జనరల్ రావత్ తరచూ రాజకీయ ప్రకటనలు కూడా చేసేవారు. అవి బీజేపీ ఆలోచనలకు దగ్గరగా ఉండేవి.

జనరల్ రావత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ కు సన్నిహితులు కూడా’’ అని బేడీ అన్నారు.

2016లో పాక్‌ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌లో జనరల్ రావత్‌కు కీలకపాత్ర పోషించారని చెబుతారు.

“గత 20నెలలుగా హిమాలయ సరిహద్దులో చైనా దురాక్రమణ కారణంగా యుద్ధం వాతావరణం ఉంది.

అటువంటి సమయంలో జనరల్ రావత్ మరణం చాలా దురదృష్టకరం.

జనరల్ రావత్ ముక్కుసూటి వ్యక్తి. చైనా పేరును ప్రస్తావించడానికి ప్రభుత్వం కూడా వెనకాడుతున్న సమయంలో రావత్ చైనా పేరును ప్రస్తావించేవారు” అని రక్షణ రంగ నిపుణుడు బ్రహ్మ చెలానీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

జనరల్ రావత్ వివాదాస్పద ప్రకటనలు

”ప్రజలను సరైనబాటలో నడిపించేవారే నాయకులు అనిపించుకుంటారు.

అనేక విశ్వవిద్యాలయాలు, కాలేజీలలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న తీరు, నగరాల్లో హింస, కాల్పులు ప్రమాదకరం.

నాయకత్వం ఈ సమయంలో కఠినంగా వ్యవహరించాలి” అంటూ జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 26, 2019న వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై విపక్షాలు మండి పడ్డాయి.

‘మోదీ ప్రభుత్వ హయాంలో సైన్యంలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి తన పరిధిని మించి ప్రకటనలు చేస్తున్నారు” అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.

“సైన్యాన్ని రాజకీయం చేయడం ద్వారా మనం పాకిస్తాన్ బాటలో వెళ్తున్నామా అనే అనుమానం వస్తోంది.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రజాస్వామిక ఉద్యమం గురించి ఉన్నత సైనికాధికారి ఇలాంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదు” అని ఏచూరి అన్నారు.

ఆర్మీ చీఫ్ తన ప్రకటనపై దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే, ప్రభుత్వం వద్దని చెప్పినప్పుడే రావత్ ఇలాంటి ప్రకటనలు చేయడం ఆపుతారని రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేడీ అన్నారు.

భారతదేశానికి ముప్పు చైనాయే, పాకిస్తాన్ కాదు అంటూ ఇటీవల కూడా జనరల్ రావత్ ప్రకటించారు.

కొన్నిసార్లు జనరల్ రావత్ ప్రకటనల కారణంగా ప్రభుత్వ దౌత్య వ్యవహారాలలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఏప్రిల్ 2020కి ముందు తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని చైనా మార్చింది.

ఇది జనరల్ రావత్ సీడీఎస్‌గా ఉన్నప్పుడే జరిగింది. ఇలాంటివి అనేక సమస్యలు ఉన్నాయి.

రాబోయే సీడీఎస్‌కు ఇవి సవాలుగా నిలవనున్నాయి.

ఇజ్రాయెల్‌ తో సైనిక సంబంధాలను పెంచుకునే విషయంలో జనరల్ రావత్ ఆసక్తిగా ఉండేవారు.

ఆయన మృతి పట్ల ఇజ్రాయెల్ అగ్రనాయకత్వం నుంచి సంతాపం వ్యక్తం చేస్తూ అనేక స్పందనలు వచ్చాయి.

ప్రధాని నఫ్తాలి బెన్నెట్ నుంచి మాజీ ప్రధాని వరకు సంతాపం వ్యక్తం చేశారు.

”జనరల్ రావత్ ఇజ్రాయెల్ రక్షణ దళాలకు నిజమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పెంపొందించడంలో జనరల్ రావత్ కీలక పాత్ర పోషించారు.

ఆయన త్వరలో ఇజ్రాయెల్‌కు రావాల్సి ఉంది” అని ఇజ్రాయెల్ రిటైర్డ్ ఆర్మీ జనరల్ బెన్నీ గాంట్జ్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

బిపిన్ మ‌ర‌ణం వెన‌క అమెరికా.. చైనా కుట్ర‌

టాటా గ్రూప్​ చేతికి ఆర్మీ విమానాల కాంట్రాక్టు

Trending in Social Media – Politics – Sports – Movie & More

Recent

- Advertisment -spot_img