– రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర బలగాలు
– బేగంపేట నుంచి మల్కాజిగిరి వరకు ఆంక్షలు
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు దఫాలు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పర్యటించారు. తాజాగా మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు. నేడు హైదరాబాద్కి రానున్న మోదీ.. మల్కాజ్గిరిలో నిర్వహించే విజయ సంకల్ప సభకు సంబంధించిన రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో బేగంపేట నుంచి మల్కాజ్గిరి రూట్ మొత్తం భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ మార్గాన్ని పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఆంక్షలు బ్రేక్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ప్రధాని మోడీ విజయ సంకల్ప రోడ్ షోలో భాగంగా మల్కాజ్గిరిలో హై అలర్డ్ కొనసాగుతోంది. మల్కాజిగిరిలో 1.3 కిలోమీటర్ల ఈ రోడ్ షో జరగనుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు రంగంలోకి దిగాయి.
ప్రధానంగా ఈ రోడ్డు మార్గాన్ని ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. కేరళ నుంచి సాయంత్రం 4.50 గంటలకు మోడీ బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్నారు. రోడ్డు మార్గం ద్వారా మీర్జాలగూడ చౌరస్తాకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు ఈ రోడ్ షోలో పాల్గొంటారు. దీంతో ఈ రూట్లో ప్రధాన రహదారులకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇరువైపులా ఉన్న షాపులను సైతం మూయించేశారు. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ చేసిన ఎస్పీజీ బృందం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసులు సహా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ రోడ్డు మార్గంలో వెళ్లేటటువంటి వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాల్సిందిగా ఇప్పటికే సూచనలను జారీ చేశారు పోలీసు అధికారులు. దీంతో మోడీ ప్రయాణించే మార్గాలన్నీ హై అలర్ట్గా కనిపిస్తోంది.