Modi : బీహార్‌లోని మధుబనీలో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు. మోడీ మాట్లాడుతూ.. ఈ దాడి కేవలం పర్యాటకులపైనే కాదు, భారత ఆత్మపై జరిగిన దుస్సాహసం. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేసే సమయం ఆసన్నమైంది. బీహార్ నేలపై నుంచి ప్రపంచమంతటికి చెబుతున్నా ఉగ్రదాడికి పాల్పడినవారిని ఎవరిని వదిలిపెట్టం అని మోడీ అన్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తాం అని అన్నారు. పహల్గామ్ ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుంది. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాల నాయకులకు, ప్రజలకు మోడీ కృతఙ్ఞతలు తెలిపారు.