సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మార్చురీ స్థానికులకు ఇబ్బందిగా తయారైంది. గుర్తు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయన్ మృతదేహాలు రోజుల తరబడి అక్కడ ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అప్పటికే డీకంపోజ్ అయిన శవాలు కూడా వస్తుంటాయి. దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక పద్మానగర్, అభినవ్ నగర్ కాలనీల్లో నివాసితులు తెలిపారు. ఆస్పత్రి మార్చురీకి 100 మీటర్ల దూరంలో ఉన్నా శవాల దుర్వాసన భరించలేకపోతున్నామని వారు వాపోతున్నారు. ఆ దుర్వాసనను పీల్చి మేము కూడా అక్కడికే వెళ్లే పరిస్థితి ఉందని మరికొందరు వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
‘ఆస్పత్రికి రోజూ 20 నుంచి 25 డెడ్‌బాడీస్ వస్తుంటాయి. ఇక్కడ 59 వరకు ఫ్రీజర్లు ఉన్నాయి. కొన్ని పనిచేయడం లేదు. ఉరి వేసుకున్నవారు, యాక్సిడెంట్ లో చనిపోయినవారు, గుర్తు తెలియని మృతదేహాలు వంటివాటిని 72 గంటల వరకూ ఫ్రీజర్‌లో ఉంచుతాం. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తాం. మామూలు మృతదేహాలను, గుర్తుతెలియని మృతదేహాలను సెపరేట్ రూమ్స్‌లో ఉంచితే సమస్య ఉండదు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’
– ఆస్పత్రి సూపరిండెంట్