ఇదేనిజం, శేరిలింగంపల్లి: భారతరత్న మదర్ థెరిస్సా జయంతి వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలో గల స్వాతి హైస్కూల్ లో కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పంజలి ఘటించి, కొవ్వొత్తులు వెలిగించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి (హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ) విచ్చేసి “ఈ సమాజంలో మానవసేవే మాధవసేవగా భావించి, సేవలందిస్తున్న కర్మయోగులైన సత్యసాయి సేవా సంస్థలకు చెందిన దుగ్గిరాల సత్యప్రకాష్, దుగ్గిరాల సుజాత, దయాసాగర్, తపస్వి అనాధ శరణాలయానికి సంబంధించిన శాంతి, సాయినేత్ర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మూగల రఘునందన్ రెడ్డి, రోటరీక్లబ్ అధ్యక్షురాలు శశిరేఖ లకు మదర్ థెరిస్సా సేవారత్న పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. తదనంతరం ముఖ్య అతిథి ఆచార్య దేవ రెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ.. మదర్ థెరీసా తన సామాజిక సేవల ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది, తన వ్యక్తి గత జీవితాన్ని త్యాగం చేసి, కష్టాలలో ఉన్న వారిని వెతికి మరీ సాయమందించిందన్నారు. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నేటి యువత ఆవిడ యొక్క సేవా తత్పరతను ఆదర్శంగా తీసుకుని, సేవాభావం అలవర్చుకోవాలన్నారు. అవార్డు గ్రహీతలు మరింతగా బాధ్యతతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ యువతలో స్ఫూర్తిని నింపాలి. గీతాచార్యులు చెప్పినట్టుగా “కర్మయోగులనగా స్వచ్ఛందసేవా సంస్థ సభ్యులే” అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాగం మల్లికార్జున యాదవ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వరరావు, వి. ఫణికుమార్, మూర్తి, వాణి సాంబశివరావు, డాక్టర్ బి సి రామన్న, పాకాలపాటి శ్రీనివాస్, కృష్ణా రావు పాల్గొన్నారు.