పేదరిక నిర్మూలన, వివక్ష రహిత సమాజం కోసం ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట ఆదివాసీలు, గిరిజనులు, పేద ప్రజలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం వివక్షకు గురవుతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడులో ఓ సంచార కుటుంబానికి అవమానం జరిగింది. సినిమా చూద్దామని క్యూలైన్‌లో వేచి ఉన్న వాళ్లను టికెట్లు ఇవ్వకుండా బయటికి పంపించివేశారు థియేటర్ సిబ్బంది. అవమానం భరించలేక వాళ్లు స్థానిక ఆర్డీఓను అశ్రయించారు. వెంటనే ఆయన స్పందించి తన వాహనంలో థియేటర్ వద్దకు తీసుకెళ్లారు. తన సొంత డబ్బులతో వాళ్లకు టికెట్టు కొన్నారు. సినిమా చూసే అవకాశం కల్పించారు. మానవత్వం మరిచి నిబంధనలు ఉల్లంఘించిన ఆ థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకొనేలా కలెక్టర్ ఆదేశాలు జరీ చేశారు.