సీఎస్కే ఐపీఎల్ 2024 సీజన్ నుంచి నిష్క్రమించడంతో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ చిల్ అవుతున్నాడు. గత రెండు నెలలుగా ఐపీఎల్లో బిజీబిజీగా గడిపిన మహి.. టోర్నీ నుంచి సీఎస్కే నిష్క్రమించిన తర్వాత మళ్లీ సాధారణ జీవితాన్ని గడపడానికి సిద్ధమయ్యాడు. ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. సీఎస్కే ప్లే ఆఫ్‌లో చేరేందుకు ధోనీ, జడేజా చివరి వరకు చేసిన పోరాటం ఫలించలేదు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే స్వగ్రామం రాంచీకి వెళ్లిన ధోనీ సోమవారం తనకు ఇష్టమైన బైక్ పై షికారుకు వెళ్లాడు. ఓ వైపు సోషల్ మీడియా వేదికగా ధోనీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు ధోనీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చిల్ అవుతున్నాడు. ధోనీ బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ హెల్మెట్ ధరించి యమహా బైక్ పై రైడింగ్ వెళ్లాడు. బైక్ పై ఫామ్‌హౌస్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఎవరో మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.