Homeఅంతర్జాతీయంAirforce : ఇజ్రాయెల్‌లో భారత యుద్ధ విమానాలు ఏం చేస్తున్నాయి

Airforce : ఇజ్రాయెల్‌లో భారత యుద్ధ విమానాలు ఏం చేస్తున్నాయి

Multinational air combat exercise in Israel with indian airforce : ఇజ్రాయెల్‌లో భారత యుద్ధ విమానాలు ఏం చేస్తున్నాయి..

‘బ్లూ ఫ్లాగ్ 2021’ పేరుతో వైమానిక విన్యాసాలను నిర్వహిస్తోంది ఇజ్రాయెల్. ఇవి ఆ దేశం నిర్వహించే అతి పెద్ద విన్యాసాలుగా చెబుతారు.

వివిధ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి రెండేళ్లకోసారి ఇజ్రాయెల్ వైమానిక దళం ఈ ఎక్సర్‌సైజ్‌ నిర్వహిస్తుంది.

ఈ సంవత్సరం ఇజ్రాయెల్‌లో జరుగుతున్న ఈ విన్యాసాలు అతిపెద్ద, అత్యాధునిక విన్యాసాలని చెబుతున్నారు.

ఇందులో ఏడు దేశాల వైమానిక దళాలు పాల్గొంటున్నాయి.

జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, గ్రీస్, అమెరికాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఇవి అక్టోబర్ 28 వరకు కొనసాగుతాయి.

ఇందులో ఆయా దేశాల నాలుగు, అయిదో తరం విమానాలు పాల్గొంటున్నాయి.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇజ్రాయెల్‌లో అయిదు రోజులపాటు పర్యటిస్తున్నారు.

ఓవ్డా ఎయిర్‌బేస్‌లో జరిగిన ‘బ్లూ ఫ్లాగ్’ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్‌సైజ్‌ను ఆయన సందర్శించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ బృందంతో ఫొటోలు దిగారు.

”భారత్, ఇజ్రాయెల్ వైమానిక దళాల మధ్య పరస్పర గౌరవం, కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.

దీనిని చూడటం చాలా సంతోషంగా ఉంది” అని ఆయన అన్నారు. రక్షణ, భద్రత అనేవి రెండు దేశాల మధ్య సంబంధాలలో మూల స్తంభాలని జై శంకర్ అన్నారు.

ఈ విన్యాసాల ప్రాధాన్యమేంటి?

ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఇవేనని ఇజ్రాయెల్ పేర్కొంది.

ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ ప్రకారం, 2017లో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు ఈ విన్యాసాలను ”వాయు దౌత్యం”(ఎయిర్ డిప్లొమసీ)గా పేర్కొన్నారు.

ఈ విన్యాసాల ద్వారా ఇందులో పాల్గొంటున్న దేశాలు తమ వైమానిక సామర్ధ్యాలను ప్రదర్శించడంతోపాటు ఎయిర్-టు-ఎయిర్, ఎయిర్-టు-గ్రౌండ్ దాడులపై దృష్టి పెడతాయి.

తమ దేశం ఏర్పడిన తర్వాత బ్రిటిష్ యుద్ధనౌకలు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ యుద్ధ విమానం కూడా మొదటిసారి ఇజ్రాయెల్‌కు వెళ్లింది.

అలాగే ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన రాఫెల్ యుద్ధ విమానాల బృందం కూడా తొలిసారి ఈ విన్యాసాలలో పాల్గొంటోంది.

ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఏమంటోంది?

ఈ విన్యాసాలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవని ఇజ్రాయెల్ మేజర్ జనరల్ అమికం నార్కిన్ అభిప్రాయపడ్డారు.

”మేం చాలా సంక్లిష్టమైన ప్రాంతంలో జీవిస్తున్నాం. గాజాస్ట్రిప్, లెబనాన్, సిరియా, ఇరాన్ నుండి మాకు ముప్పు నిత్యం పెరుగుతూనే ఉంది” అని ఆయన చెప్పారు.

“ఈ పరిస్థితిలో అంతర్జాతీయ విన్యాసాలు నిర్వహించడం వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యం.

అదే సమయంలో ఇవి ఇజ్రాయెల్ వైమానిక, రక్షణ దళాలతోపాటు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి” అని నార్కిన్ అన్నారు.

”ఈ విన్యాసాలు ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారంలో ఒక పెద్ద ముందడుగు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

టెక్నిక్, శిక్షణ, నాణ్యత, పాల్గొనే సభ్యుల సంఖ్య విషయంలో కూడా ఈ విన్యాసాలు అపూర్వమైనవని నార్కిన్ చెప్పారు.

ఇది దేశాల వైమానిక దళాల మధ్య బలమైన భాగస్వామ్యం, సంబంధాలపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

విన్యాసాల తొలి రోజైన ఆదివారం నాడు నార్కిన్, జర్మనీ లెఫ్టినెంట్ జనరల్ ఇంగో గెర్హార్ట్జ్‌తో కలిసి, జెరూసలేం మీదుగా ఇజ్రాయెల్-జర్మన్ విమానాలను నడిపించారు.

నార్కిన్ ‘ఫాల్కన్’ (ఎఫ్-15) విమానానికి పైలట్‌గా వ్యవహరించగా గెర్హార్ట్జ్ ‘ఈగిల్ స్టార్’ యూరో ఫైటర్‌ని నడిపారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి అవివ్ కొచావి మంగళవారం గెర్హార్జ్‌కు మెడల్ అందించారు.

ఇజ్రాయెల్, జర్మన్ భద్రతా దళాల మధ్య సహకారాన్ని పటిష్టం చేసినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది.

జర్మనీ అత్యున్నత జాతీయ పురస్కారం ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ను నార్కిన్‌కు ఇజ్రాయెల్‌లో జర్మనీ రాయబారి సుసాన్ వాసుమ్-గైనర్ అందించారు.

”గత ఏడాది జర్మనీ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలలో ఇజ్రాయెల్ విమానం పాల్గొనడం రెండు దేశాల సైనికుల మధ్య పెరుగుతున్న వృత్తిపరమైన, స్నేహపూర్వక వైఖరికి నిదర్శనం” అని వాసుమ్-గైనర్ అన్నారు.

Recent

- Advertisment -spot_img