Homeహైదరాబాద్latest Newsఆర్సీబీని మట్టికరిపించిన ముంబై

ఆర్సీబీని మట్టికరిపించిన ముంబై

Idenijam, Webdesk : ఛేజింగ్‌ను ఛాలెంజ్‌గా తీసుకొని ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసే టీమ్స్‌లో ముంబై ఇండియన్స్ ముందువరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సరే ఛేదించే కెపాసిటీ ముంబై సొంతం. ఎందుకంటే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఈ టీం భారీ లక్ష్య ఛేదనను చూసి టెన్షన్ పడకుండా కూల్‌గా ఆడి తన పనిని ముగించేసి ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తుంటుంది. ముంబై వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే రిపీట్ అయింది. సింగిల్స్, డబుల్స్ కన్నా ఫోర్లు, సిక్సర్లు బాదడమే ఈజీ అన్నట్లు భారీ షాట్లతో హిట్టింగ్ చేస్తూ ఆర్సీబీ విసిరిన 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవరల్లోనే చేజ్ చేసి సూపర్ అనిపించింది.

టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్‌కు మెరుగైన ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బుమ్రా కోహ్లీని పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత మద్వాల్ వేసిన ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి విల్ జాక్స్ మిడాన్‌లో టిమ్ డేవిడ్‌కు దొరికిపోయాడు. అప్పటికి ఆర్సీబీ స్కోరు 4 ఓవర్లకు 28/2. ఆ తర్వాత వచ్చిన పటిదార్, డుప్లెసిస్‌తో కలిసి రక్షణాత్మక షాట్లు ఆడాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి మూడో వికెట్‌కు వీరిద్దరూ 82 పరుగులు జోడించారు. 26 బంతుల్లో 50 రన్స్‌తో ప్రమాదకరంగా మారిన పాటిదార్‌ కోయెట్జీ వేసిన ఓ షార్ట్‌పిచ్ బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో 82 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరదించినట్లయింది. ఆ వెంటనే వచ్చిన మ్యాక్స్‌వెల్ క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కేవలం 4 బంతులాడి శ్రేయస్ బౌలింగ్‌‌కు వికెట్ల ముందు దొరికి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే ఫాఫ్ ఈ సీజన్‌లో తన మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి బెంగళూరు స్కోరు 15 ఓవర్లలో 130 /4. క్రీజులో డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ ఉన్నారు. బుమ్రాకు ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. భారీ స్కోరు దిశగా అడుగులేస్తున్న ఆర్సీబీని 17వ ఓవర్లో బుమ్రా కోలుకోలేని దెబ్బ తీసాడు. రెండు వరుస బంతుల్లో డుప్లెసిస్, లామ్రోర్‌ను ఔట్ చేసి ముంబై టీంలో ఉత్సాహాన్ని నింపాడు. 170 చేయడం కూడా కష్టమే అనుకున్న తరుణంలో ఓవైపు వికెట్లు పడుతున్నా.. దినేష్ కార్తీక్ చివర్లో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడి స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు.

భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇషాన్, రోహిత్ ఏ మాత్రం తడబడకుండా క్లియర్ అండ్ పాజిటివ్ మైండ్‌సెట్‌తో దాదాపు మొదటి 9 ఓవర్లపాటు ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకుంటూ మొదటి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులే సాధించిన వీరి జోడీ మూడో ఓవర్లో గేర్లు మార్చింది. తోప్లే వేసిన మూడో ఓవర్లో ఇషాన్ వరుసగా మూడు ఫోర్లు బాది ఇన్నింగ్స్ స్పీడును పెంచాడు. వీరిద్దరూ కలిసి సిరాజ్ వేసిన అయిదో ఓవర్లో ఏకంగా మూడు సిక్సులు, ఓ ఫోర్‌తో ఏకంగా 23 పరుగులు రాబట్టారు. పవర్‌ప్లే ముగిసేసరికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 72 పరుగులు చేసి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేసింది ఈ జోడీ.

34 బంతుల్లో 69 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 9 ఓవర్‌లో ఆకాశ్ దీప్ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించి కోహ్లీ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ స్కై ఈజ్ ది లిమిట్ అన్నట్లుగా చెలరేగి ఆడాడు. 11 ఓవర్లో సూర్య కుమార్ యాదవ్ స్క్వేర్ లెగ్‌ లో రెండు కళ్లుచెదిరే సిక్సర్లు, స్ట్రెయిట్ డౌన్‌లో ఓ సిక్సర్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగి మొత్తంగా 24 పరుగులు స్కోరుబోర్డుకు జతచేశాడు. ఆ తర్వాతి ఓవర్లో స్క్వేర్ లెగ్‌లో ఆడేందుకు యత్నించిన రోహిత్ శర్మను తోప్లే స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన హర్దిక్ తానెదుర్కొన్న మొదటి బంతినే స్ట్రెయిట్ డౌన్‌లో సిక్స్‌గా మలిచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ 17 బంతుల్లో 50 పరుగులతో ఐపీఎల్‌లో తన ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. తర్వాత సూర్య ఔట్ అయినా తిలక్ వర్మతో కలిసి హర్దిక్ ముంబైని విజయతీరాలకు చేర్చాడు. 6 బంతుల్లో 21 పరుగులు చేసిన హర్దిక్ తన టెంపో, ఇంటెన్షన్‌తో విమర్శకుల నోళ్లు మూయించి డాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా తనని తాను నిరూపించుకున్నాడు. 2 స్టాండ్ అండ్ డెలివర్ సిక్సులు, చివర్లో హాప్‌సైడ్ కొట్టిన సిక్స్ మ్యుచ్‌కే హైలైట్. 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Recent

- Advertisment -spot_img